Telangana | న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్ వల్ల పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరి కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్లు, పారిశుద్ధ్య రంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు.