కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ)/రామచంద్రాపురం/గోల్నాక: తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రహదారుల అభవృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. సోమవారం రాష్ట్రంలో పర్యటించిన నితిన్‌గడ్కరీ పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి పలు జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లను ప్రారంభించారు. తొలు త కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న నితిన్గడ్క రీ.. మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల మీదు గా మహారాష్ట్ర సరిహద్దు వరకు రూ.3,900 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే-363 నాలుగు వరుసల రహదారితోపాటు నిర్మల్-ఖానాపూర్ ఎన్‌హెచ్-61 రెండు వరుసల రహదారి, ఆదిలాబాద్ మీదుగా వెళ్తున్న నాగ్‌పూర్-హైదరాబాద్ నేషనల్ హైవే-44లో అండర్‌పాస్‌లు, జంక్షన్లను ప్రారంభించారు. అనంతరం బీహెచ్ఈఎల్ చౌరస్తా, ఆర్సీపురం డివిజన్లో నిర్మించిన ఫ్లైఓవర్లతోపాటు అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఆయా కార్యక్రమ్లాలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎంపీలు పాల్గొన్నారు.