Badi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ‘ఎక్స్’లో సంచలన పోస్టు పెట్టారు. తెలంగాణలోని రాజకీయ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రసంగాలు చేస్తూ.. ఒకవైపు మావోయిస్టుల సాయుధ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తున్న వారు వెంటనే తమ సంబంధాలు తెంచుకోవాలని.. లేనిపక్షంలో వారి బండారం బయటపడడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్ట్ నెట్వర్క్ వద్దే ఆగవని.. అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడే వ్యవస్థ మొత్తం వెలికి తీసి కఠినంగా అణచివేస్తాయన్నారు. ఎవరైనా సరే.. ఎంత పెద్దవారైనప్పటికీ.. దేశ భద్రత విషయంలో మావోయిస్టుల వైపు నిలబడితే క్షమించేది లేదన్నారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సహా పలువురు మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మావోయిస్టులతో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. మావోయిస్టు గెరిల్లాలు, కొందరు తెలంగాణ రాజకీయ నేతల మధ్య కుమ్మక్కైనట్లుగా మల్లోజుల చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులతో సంబంధాలున్న నేతలు ఎవరూ? అనే చర్చ సాగుతుంది. ఈ క్రమంలో పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాజకీయ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక.
ప్రజాస్వామ్యం పేరుతో ప్రసంగాలు చేస్తూ, ఒకవైపు మావోయిస్టుల సాయుధ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తున్న వారు, వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలి. లేని పక్షంలో మీ బండారం బయట పడడం ఖాయం.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి మరియు కేంద్ర హోం… https://t.co/8wpTKX7SI0
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 19, 2025