Bandi Sanjay | సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అనవసరంగా అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిచెందడం బాధాకరమని అన్నారు. ఆ విషయాన్ని అందరూ ఖండించారని తెలిపారు. మృతురాలి కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ఎంఐఎంతో కలిసి సినిమా లెవల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టు కథ అల్లారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. సమస్య ముగిసిన తర్వాత కూడా ఎంఐఎం సభ్యుడితో సీఎం మళ్లీ లేవనెత్తారని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలుచేశారని మండిపడ్డారు.
గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారని.. వారిని ఏనాడైనా పరామర్శించారా అని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ మరణాలకు మీరు బాధ్యత వహించారా అని నిలదీశారు. మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా అని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికారు.