Bandi Sanjay | అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో.. మావోయిస్టుల చేతుల్లో కాదని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏరియా ఆస్పత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టుల చేతుల్లో తుపాకులు ఉంటే చర్చల ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులకు ఇబ్బందులు కలిగించలేదని గుర్తుచేశారు. బుల్లెట్ నమ్ముకుని మావోయిస్టులు ప్రాణాలు తీసుకుంటున్నారు.. మేం బ్యాలెట్ నమ్ముకుని అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు. అడవుల్లో ఆదివాసీలు, గిరిజనులను మావోయిస్టు చంపుతున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్లో ఆదివాసీలు, గిరిజనుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారణమని ఆరోపించారు. అర్బన్ నకల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే.. అడవుల్లో పేద గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
అర్బన్ నక్సలైట్లనునమ్మి మోసపోవద్దని సూచించారు. వారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారని తెలిపారు. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులు అని చెప్పారు.
మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. చిన్న పిల్లలకు తుపాకులు ఇచ్చి మావోయిస్టులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కానీ కొంతమంది ఇంకా లొంగిపోకుండా పంతాలకు పోతున్నారని పేర్కొన్నారు. పంతాలకు పోయి.. ప్రాణాలు తీసుకోవద్దని హితవుపలికారు. మావోయిస్టులను అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మార్చి 2026లోపు మావోయిస్టులందరూ లొంగిపోవాలని కోరారు. మావోయిస్టులు జనంలో కలిసేందుకు ఇంకా నాలుగు నెలల గడువు మాత్రమే ఉందని.. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.