Bandi Sanjay | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు. ఈ కమీషన్లపై కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమీషన్ల భాగోతం బద్దలు కావొచ్చని సోమవారం మీడియాతో చెప్పారు. కమీషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న రేవంత్ ప్రభుత్వం ఏడాదైనా నయా పైసా బిల్లు చెల్లించలేదని బండి సంజయ్ ఆరోపించారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు ఎంపీడీవో నుంచి కలెక్టర్, చీఫ్ సెక్రటరీ వరకూ.. ఎంపీ, మంత్రులు మొదలు సీఎం వరకూ అందరినీ కలిసి మొర పెట్టుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మంజూరు కాక రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు మాజీ సర్పంచ్‌లు రోడ్డున పడ్డా రేవంత్ రెడ్డి సర్కార్‌కు చీమ కుట్టినట్లయినా లేదని బండి సంజయ్ మండిపడ్డారు. మాజీ సర్పంచ్‌లకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందన్నారు. మాజీ సర్పంచ్ల పక్షాన అతి త్వరలోనే ఉద్యమిస్తామన్నారు.
రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పట్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని బండి సంజయ్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షల మంది విద్యార్థులు అల్లాడిపోతున్నారని అన్నారు. వారికి కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు జీతాలు చెల్లించలేక కాలేజీలను మూసి వేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే రోగులను చేర్చుకోవడం లేదని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం దిగిరావాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సర్పంచ్‌లతో కలిసి ఉద్యమిస్తాం అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 22శాతం క్రైం రేట్, మహిళలపై అత్యాచారాలు 28 శాతం పెరిగిందని బండి సంజయ్ చెప్పారు. శాంతి భద్రతలను కాపాడలేని చేతగాని సర్కార్ నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. `వీళ్లకు ప్రజల బాధలు పట్టవు. ఢిల్లీకి పోయి కప్పం కట్టి పదవులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవాలని లేదు… ఆరు గ్యారంటీలను అమలు చేయాలనే ధ్యాస లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు. నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే. ఆయనలో మరి ఏం కన్పించిందో. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయలేదు? క్రైం రేటు పెరిగింది. మరి ఆయనలో గొప్ప నాయకుడు ఎట్లా కన్పించారో వారికే తెలియాలి` అని అన్నారు.
`సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు పోయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ అంశం ముగిసింది. కానీ మళ్లీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు ఈ అంశంపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముంది? ఆరు గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగమే. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ మధ్య ఏదో చెడింది. పుష్ప-2 సినిమాకు రూ.1700 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ పుష్ప-3 సినిమా చూపించారు. అల్లు అర్జున్ పై కేసును మృతురాలి భర్త వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత దీనిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు` అని బండి సంజయ్ ప్రశ్నించారు.
`అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? పంచ్ తీర్థ్ లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించేందుకు ఎందుకు ప్రయత్నించింది? మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా ఎందుకు అవమానించారు? నాటి ప్రధాని వీపీ సింగ్ విషయంలో ఇట్లనే అవమానించింది నిజం కాదా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నన్నాళ్లూ… సోనియాగాంధీ సూపర్ పీఎంగా వ్యవహరిస్తూ మన్మోహన్ సింగ్‌ను రబ్బర్ స్టాంప్‌గా తయారు చేసింది నిజం కాదా? కాంగ్రెస్ తీరును చూసి మన్మోహన్ సింగ్ ఆత్మ క్షోభిస్తోంది` అని బండి సంజయ్ పేర్కొన్నారు.
సోమవారం మధ్యాహ్నం మాజీ సర్పంచ్ల రాష్ట్ర సంఘం అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా కరుణాకర్ మాట్లాడుతూ `ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై పోరాడి పరిష్కారం చూపిన నాయకుడు బండి సంజయ్. మాజీ సర్పంచ్ల సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తారనే నమ్మకంతో కలిసి వినతి పత్రం సమర్పించాం. మేం ప్రజల కోసం పనులు చేసి అప్పుల పాలైతే, కనీసం పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇవాళ రోడ్డున పడ్డాం. మా పక్షాన పోరాడాలని సంజయన్నను కోరాం. అండగా ఉంటానన్న భరోసానిచ్చిన బండి సంజయ్ అన్నకు రుణపడి ఉంటాం` అని పేర్కొన్నారు.