హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ‘మా పార్టీ కార్యకర్తల దమ్మేందో తెలిసిందా?’ అంటూ కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ సమర్థించుకున్నారు. గురువారం సికింద్రాబాద్ సురభి గార్డెన్స్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేయాలనే ఆలోచన తమ పార్టీ కార్యకర్తలకు లేదంటూ బుకాయించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సర్కార్ నిధులతో నిర్మించారని, అక్క డ బూతులు తిడుతూ ప్రెస్‌మీట్ పెట్టడం కరెక్టా? అని ప్రశ్నించారు. ‘కార్యకర్తల సహనానికీ ఓ హద్దు ఉంటుందని, దాన్ని పిరికితనంగా భావించొద్దు’ అంటూ బెదిరింపులకు దిగారు. బీజేపీ ఎన్నడూ దాడులను ప్రోత్సహించదు అంటూనే.. తాను ప్రజాసంగ్రామ యాత్ర చేసేటప్పుడు తమపై దాడులు చేశారని, వాటన్నింటినీ మర్చిపోతామా? అంటూ కార్యకర్తలను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసి ఇప్పుడు సుద్దపూస లెక్క మాట్లాడితే సరిపోతుందా? అని పేర్కొన్నారు. బీజేపీ మహిళా కార్యకర్తలపై దాడులు, రైతులను ఎత్తుకుపోయిన విషయాన్ని మర్చిపోతామా? అని ప్ర శ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, హద్దులో ఉంటూ హుందాగా వ్యవహరిస్తే మంచిదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్థాయి మరచి తమ పార్టీ కార్యకర్తలను మరిన్ని దాడులకు ఉసిగొల్పేలా బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.