Amit Shah | వికారాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): పదేపదే తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షా.. రాష్ర్టానికి ఏం ఇస్తారో, ఏం చేస్తారో చెప్పకుండా మరోమారు చేవెళ్ల విజయ్ సంకల్ప సభలో చేసిన ఊకదంపుడు ప్రసంగంతో ప్రజలు విసుగుచెందారు. అమిత్షా ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే చాలామంది వెనుదిరిగారు. కేంద్రమంత్రి ప్రసంగం ముగియకముందే సభాప్రాంగణం సగం ఖాళీ కావడం గమనార్హం. 50 వేల మందితో అమిత్షా భారీ సభ అంటూ నెల రోజులుగా ఊదరగొట్టిన బీజేపీ నేతలు.. 15 వేల మంది కూడా రాకపోవడంతో ఊసురుమన్నారు. సభ మధ్యలోనే వెనుదిరిగిన జనాన్ని కొంతసేపు ఉండాలంటూ బీజేపీ నాయకులు బతిమిలాడినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశమివ్వాలని అమిత్షా, బండి సంజయ్ పదేపదే ప్రాధేయపడినా ప్రజల నుంచి స్పందన రాలేదు.
తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలా? వద్దా? అంటూ జనం వైపు చూడగా, స్టేజీ మీద, కింద ఉన్న బీజేపీ నేతలు తప్ప సభకు హాజరైన జనాలు స్పందించలేరు. కాగా, అమిత్షా స్పీచ్ ఆద్యంతం మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలపైనే సాగింది. ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. విజయ్ సంకల్ప సభతో బీజేపీ క్యాడర్లో జోష్ వస్తుందనుకుంటే.. అమిత్షా పాత ముచ్చట్లే చెప్పడంతో నిరాశకు గురైంది. మరోవైపు వంట గ్యాస్ మొదలుకొని నిత్యావసరాలైన నూనె, బియ్యం తదితరాల ధరలను పెంచి పేద ప్రజలు బతకడమే భారంగా చేసిన బీజేపీ సభకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ మహిళలు దూరంగా ఉన్నారు. సభకు వచ్చిన కొంతమంది మహిళలు కూడా అమిత్షా ప్రసంగం మొదలుపెట్టక ముందే వెనుదిరిగిపోయారు.