హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దసరా పండుగపూట మరో ఆటో డ్రైవర్ కుటుంబంలో చీకట్టు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని మల్లాపూర్ అశోక్‌నగర్‌లో ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆటో డ్రైవర్ డేవిడ్ (30) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సెప్టెంబర్ 24న డేవిడ్ తన ఇంటిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనను చూసిన అతని పదేండ్ల వయసున్న కొడుకు ఏడుస్తూ చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారొచ్చి డేవిడ్‌ను హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడే ఐదురోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. డేవిడ్ గత ఐదేండ్లుగా ఉప్పల్ అశోక్‌నగర్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఆటోయే అతడి జీవనోపాధి. అతనికి ఇద్దరు పిల్లలు. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సుతో గిరాకీ లేక కుటుంటాన్ని పోషించడం భారంగా మారిందని తరచూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పుకొని బాధపడేవాడు. గిరాకీ సన్నగిల్లడంతో కొన్ని రోజులుగా డేవిడ్ ఒత్తిడికి గురవుతున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గిరాకీ కరువై, ఆర్థిక సమస్యలు పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.
ఆటో గిరాకీ కరువై ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ డేవిడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆటో యూనియన్ నాయకుడు వేముల మారయ్య ప్రభుత్వాన్ని కోరారు. డేవిడ్ మృతి విషయం తెలిసి ఆటో యూనియన్ నాయకులు గాంధీకి వెళ్లి సంతాపం తెలిపారు. డేవిడ్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఆటో డ్రైవర్లను చంపేందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మారయ్య ఆ గ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 156 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం ఇవ్వలేని స్థితిలో సర్కారు ఉన్నదని విమర్శించారు.