హైదరాబాద్ జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రతినెలా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పదే పదే ఘంటాపథంగా చెబుతున్నరు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ తారీఖు పోయి 14వ తారీఖు వచ్చినా వేతనాలు ఖాతాల్లో జమకాకపోవడంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
70 వేల మంది ఎదురుచూపులు..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల మంది అంగన్వాడీ టీచర్లు, సహాయకులు పనిచేస్తున్నారు. టీచర్లకు రూ.13,650, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు అందజేస్తున్నారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీ సిబ్బంది వేతనాలను రూ.18 వేలకు పెంచుతామని, ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, గద్దెనెక్కి 19 నెలలు దాటినా హామీ అమలు కావడంలేదని అంగన్వాడీ యూనియన్ల నాయకులు ఆరోపిస్తున్నారు. మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామని సీఎం, మంత్రులు చెబుతున్న మాటలు అబద్ధాలని మండిపడుతున్నారు.
వేతనాల కోసం అరిగోస..
వేతనాల ఆలస్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇల్లు కిరాయి, నిత్యావసరాల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తుందని, పిల్లల ఫీజులు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని అనుకున్న కలలు కల్లలవుతున్నాయని మనోవేదనకు గురవుతున్నారు.
వెట్టిచాకిరీ చేసినా గుర్తింపు లేదు..
రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు అందించడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నదని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వే బాధ్యతలతోపాటు ఎన్నికల విధులు కేటాయిస్తున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ వెట్టిచాకిరీ చేసినా ప్రభుత్వం తమను గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తులు చేస్తేగానీ వేతన నగదు ఖాతాల్లో జమయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నెలనెలా జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది
ప్రతినెలా ఫస్ట్ తారీఖు వచ్చిందంటే రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సమస్యలతో సతమతమవు తూ అప్పుల పాలవుతున్నారు. ఈ సమస్య ను అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదు. విధులు పక్కనబెట్టి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఇప్పటికైనా సంబంధిత మంత్రి చొరవ చూపి వేతన సమస్యను పరిష్కరించాలి.
– కే సునీత, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు(సీఐటీయూ)