హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను వర్తింపజేయకుండా జీవో-29 జారీ చేసిందని విమర్శించారు.
‘డిసెంబర్ 9 సోనియా జన్మదినం.. నిరుద్యోగుల పాలిట బలిదినం కాబోతుంది’ అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని, గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆందోళన ప్రభుత్వానికి తెలిసేందుకే తాము ర్యాలీ నిర్వహించామని, తనను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో బజరంగ్దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నట్టు ప్రకటించారు.