హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : డీమ్డ్ యూనివర్సిటీలు, ఆఫ్ క్యాంపస్‌లకు అనుమతులపై సీఎం రేవంత్‌రెడ్డి లేఖపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి స్వయానా ఆయన ఓ ఘాటు లేఖ రాశారు. వీటి ఏర్పాటుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ అవసరంలేదని ధ్రువీకరించారు. ఇలాంటి మార్గదర్శకాలేవీ లేవన్నారు. ‘డీమ్డ్ వర్సిటీలు, ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్టేట్ యూనివర్సిటీలు నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీచేస్తున్నాయి. స్టేట్ యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. ఈ తరుణంలో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ కోరేందుకు ప్రత్యేక నిబంధనలు ఎందుకు? అంటూ లేఖలో ప్రశ్నించారు. ఈ రకమైన నిబంధన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఎన్వోసీల జారీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. నకిలీని తగ్గిస్తుందని లేఖలో ప్రస్తావించారు. యూజీసీ 2019 మార్గదర్శకాలు(ఇన్స్టిట్యూషన్స్), డీమ్డ్ టూ బీ యూనివర్సిటీస్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా స్టేట్ యూనివర్సిటీల నుంచి ఎన్వోసీ తీసుకోవాలన్న నిబంధన ఏది లేదు. వీటిని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రమే యం అవసరమని గుర్తించి, యూజీసీ 2023 మార్గదర్శకాల ప్రకారం అవకాశం కల్పించాం. ప్రభుత్వానికి చెందిన స్టేట్ యూనివర్సిటీ ఒకసారి ఎన్వోసీ ఇచ్చాక, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ అవసరంలేదు అని లేఖలో పేర్కొన్నారు.
యూజీసీ పలు విద్యాసంస్థలకు డీమ్డ్ హోదా కల్పిస్తున్నది. ఆఫ్ క్యాంపస్ సెంటర్లకు అనుమతులు ఇస్తున్నది. ఈ వర్సిటీలపై కాంగ్రెస్ సర్కా రు మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉంది. సీట్ల భర్తీ, ఫీజులు సహా అకాడమిక్ అంశాల్లో ప్రభుత్వ నియంత్రణ లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ‘తమ రాష్ట్రంలో విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు మా అజమాయిషీ ఉండొద్దా? నీళ్లు ఇచ్చేది మేమే. కరెంట్ ఇచ్చేది మేమే. శాంతిభద్రతలు చూసేది మేమే. అన్ని రకాల వసతులు కల్పించేది మేమే. కానీ మా నియంత్రణ ఉండకూడదా..? మమ్మల్ని సంప్రదించిన తర్వాతే కొత్తగా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు మంజూరు చేయాలని ఘాటు లేఖ రాసింది. తాము ఎన్వోసీ ఇస్తేనే కొత్త వర్సిటీలకు అనుమతులు ఇవ్వాలని కోరింది. ఇటీవలే ఇదే అంశం హైకోర్టుకు కూడా చేరింది. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లేఖ ద్వారా స్పందించారు. డీమ్డ్ వర్సిటీలు, ఆఫ్ క్యాంపస్ సెంటర్లకు జేఎన్టీయూ, ఓయూ సహా పలు వర్సిటీలు ఎన్వోసీలు జారీచేస్తున్నాయి. ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసిన తర్వాత 60 రోజుల్లోపు వర్సిటీ ఆమోదించాలి.. లేదంటే తిరస్కరించాలి. పెండింగ్‌లో పెడితే 60 రోజుల తర్వాత ఎన్వోసీ జారీ (డీమ్డ్ టూ బీ అప్రూవల్) అయినట్టుగానే పరిగణిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నది.