హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నది. ఏపీకి రూ.6,756 కోట్లు చెల్లించాలని 2020 ఆగస్టులో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ జెన్కో, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఏపీ నుంచి రావాల్సిన రూ.4,774 కోట్ల బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా తెలంగాణ జెన్కో కోరింది.
వీటిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం కేంద్ర ఆదేశాలను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను మరోసారి పొడిగించింది. తదుపరి విచారణ వరకు స్టే కొనసాగుతుందని వెల్లడించింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. ఏపీకి బకాయిలు చెల్లించాలని తెలంగాణను ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 92ను కేంద్రం ఉల్లంఘించిందని చెప్పారు. రెండు విద్యుత్తు సంస్థల మధ్య వైరాన్ని లేదా వివాదాన్ని కమిటీ పరిషరించాలిగానీ కేంద్ర కాదన్నారు.
కేంద్రం తనకు లేని అధికారంతో పెత్తనం చేసే ప్రయత్నాలను గమనించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ వాదనలను వినకుండానే కేంద్రం ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించిందని తప్పుపట్టారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, అందులో భాగంగానే రూ.6,757 కోట్లను వెంటనే ఏపీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. ఏపీ విద్యుత్తు సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలిపారు.
ఒక రాష్ట్రంలో విద్యుత్తు కొరత ఉంటే మరో రాష్ట్రం పదేండ్ల వరకు సరఫరా చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నదని గుర్తుచేశారు. అయినప్పటికీ తెలంగాణకు విద్యుత్తు సరఫరాను ఏపీ నిలిపివేసిందని చెప్పారు. తీవ్ర విద్యుత్తు కొరత నెలకొనే పరిస్థితులు ఏర్పడకుండా తెలంగాణ బయటి నుంచి విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ కారణంగా రాష్ట్రంపై రూ.4,740 కోట్ల భారం పడిందని చెప్పారు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.