హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విత్తన పరీక్షల్లో ఏకరూప విధానం అమలయ్యేలా ఇస్టా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఈజిప్ట్ పర్యటనలో భాగంగా ఇస్టా కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా మంత్రి గురువారం మాట్లాడుతూ.. విత్తన వాణిజ్యాన్ని పెంచేందుకు ఇస్ట్టా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అన్ని దేశాల్లో విత్తన నాణ్యత పరీక్షలు బలోపేతం చేసే దిశగా నూతన ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంలో నాణ్యమైన విత్తనాలదే కీలక పాత్ర అని, ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఇస్ట్టా మరింత కీలకంగా వ్యవహించాలని కోరారు. అంతర్జాతీయ విత్తన ఎగుమతుల్లో కీలకమైన ఇస్టాకు అధ్యక్షుడిగా తెలంగాణ వ్యక్తి కే కేశవులు ఎన్నిక కావడం గర్వంగా ఉన్నదని అన్నారు. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి స్థిరంగా పెరుగుతున్నదని, ఇస్టా వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా రైతులకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.