హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత నూతన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమ ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అభిప్రాయపడ్డారు. ఆరెస్సెస్, బీజేపీ ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలంటే దేశంలోని విప్లవకర శక్తులు, కమ్యూనిస్టులు ఏకం కావాలని అన్నారు. విజయవాడలో శనివారం ప్రారంభమైన సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. దేశానికి ప్రత్యామ్నాయం చూపించడంలో కమ్యూనిజం విజయవంతమైందని, కొవిడ్ సమయంలో కేరళ నమూనా జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
మోదీ ప్రభుత్వ వినాశకర విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జీ దేవరాజన్ అన్నారు. మతోన్మాద మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో గద్దెదించాల్సిందేనన్నారు. సీపీఐకి పూర్వవైభవాన్ని తీసుకురావడమే లక్ష్యమని పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పాల్గొన్నారు.