షాద్‌నగర్‌టౌన్, నవంబర్ 22 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలోని జానంపేట వికానందకాలనీ అతి పురాతన బసవన్న ఆలయం ముందున్న శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు మాయం చేశారు. అర్చకులు శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఆలయం ముందున్న శివలింగాన్ని తొలగించినట్టు కనిపించడంతో స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. శివలింగాన్ని తొలగించడంతోపాటు వినాయక విగ్రహాన్ని ఆలయ సమీపంలో పడవేయడంపై హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆలయం వద్ద ధర్నా చేపట్టారు. సంఘటనా స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ నర్సింహ, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బస్వం, హిందూ సంఘాల నాయకులు పరిశీలించారు. శివలింగాన్ని తొలగించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బసవన్న ఆలయంలో ఇదివరకే నూతన శివలింగాన్ని ప్రతిష్ఠించగా.. ఆలయం ముందు భిన్నంగా ఉన్న శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హనుమాన్ ఆలయంలో మంటలు
మహదేవపూర్, నవంబర్ 22: భూపాలపల్లి మండలంలోని అంబట్పల్లి అమరేశ్వర ఆలయ ఆవరణలో ఉన్న హనుమాన్ ఆలయంలో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆలయ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు. హనుమాన్ పాదాల వద్ద పెట్టిన కుడుకలోని దీపం అంటుకొని విగ్రహానికి గల చందనం, నూనె వల్ల మంటలు వ్యాప్తి చెందాయని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు.