ఐనవోలు, జూన్ 15: సాగుచేస్తున్న భూమిలో విత్తిన మక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదని ఓ కౌలు రైతు ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్గా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన కౌలు రైతు బండారి శ్రీను.. వెంకటాపురం శివారులో 1.2 ఎకరాల భూమిని సాగుచేస్తున్నాడు. మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాప్లో రూ.4500 చొప్పున ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన మూడు మక్కజొన్న విత్తన బస్తాలను కొనుగోలు చేశాడు. వాటిని తన పొలంలో విత్తి 13 రోజులు గడిచినా 10 శాతం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. కంపెనీ నిర్వాకంతో ఇప్పటి వరకు రూ.25 వేల వరకు పెట్టుబడి నష్టపోయాడు. తన భూమిలోనే కాదు.. ఆ కంపెనీ విత్తనాలు చుట్టు పక్కల రైతు భూముల్లో కూడా మొలకెత్తలేదని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఈ విషయమై ఏవో అడుప కవితను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టి వచ్చిందని, తాను సెలవులో ఉన్నానని, విత్తనాల నమూనాను ల్యాబ్లో పరీక్షించి వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.