నమస్తే నెట్వర్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటి, రెండు, మూడు ఇలా స్వల్ప ఓట్ల తేడాతో పలువురు అభ్యర్థులు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. కొందరికి సమాన ఓట్లు రాగా టాస్ వేసి విజేతలను ప్రకటించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రువ్వి గ్రామంలో ఒక్క ఓటుతో నక్క మల్లేశ్‌ను సర్పంచ్ పదవి వరించింది. మొదట ఒక్క ఓటు అధిక్యం రాగా, రీ కౌం టింగ్లోనూ మల్లేశ్‌ను గెలుపు వరించింది. బైంసా మండలం లింగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సుష్మారాణి ఒక్క ఓటుతో గెలుపొందారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుర్రాలగండిరాజపల్లి (జీజీఆర్‌పల్లి)లో కాంగ్రెస్ అభ్యర్థి బూస నర్సయ్య ఒక్క ఓటుతో గెలిచారు. నెక్కొండ మండలం అమీన్‌పేటలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి డెక్క చంద్రయ్య తొలుత ఒక్క ఓటుతో గెలువగా, ప్రత్యర్థులు రీ కౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. చివరకు కలెక్టర్ జోక్యంతో ఇక్కడ ఫలితాన్ని ప్రకటించినట్టు సమాచారం. కాంగ్రెస్ బలపరిచిన డెక్క ఎల్లయ్యకు 256 ఓట్లు రాగా, బీఆర్ఎస్ బలపరిచిన డెక్క చంద్రయ్యకు 255 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో ఎల్లయ్య గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. నెక్కొండ మండలం సీతారాంపురంలో బీఆర్ఎస్ మద్దతునిచ్చిన అభ్యర్థి కట్కూరి విజయలక్ష్మి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
నెక్కొండ మండలం రెడ్యానాయక్తండాలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి అంగోత్ ఉమ రెండు ఓట్ల తేడాతో గెలిచింది. నెక్కొండ మండలం మడిపెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి అంగోత్ అనూష మూడు ఓట్ల తేడాతో గెలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండ లం భూక్యాతండా సర్పంచ్ స్థానానికి తొలు త ఎనిమిది మంది నామినేషన్ వేశారు. కాంగ్రెస్ బలపరిచిన మదన్‌కు మద్దతు ఇవ్వాలని తండావాసుల నిర్ణయంతో ఆరుగురు విత్ డ్రా చేసుకున్నారు. చివరి రోజు బీఆర్ఎస్ బలపరిచిన రమావత్ శ్రీకాంత్ సైతం విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లగా, మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. మూడో విడతతో మూడు ఓట్ల అధిక్యంతో శ్రీకాంత్ గెలిచాడు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని బెల్గాం తండా సర్పంచ్‌గా జాదవ్ గోకుల్దాస్ టాస్ ద్వారా ఎన్నికయ్యాడు. బెల్గాం తండా జీపీలో అనిల్, జాదవ్ గోకుల్‌కు 192 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా అదృష్టం గోకుల్‌ను వరించింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని కంఠం గ్రామంలో టాస్ ద్వారా సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అజ్గిరి సాయినాథ్ గెలుపొందారు. ఇబ్రహీంపేట్ జీపీ, బోర్లం క్యాంపు తండాలో ఇద్దరు వార్డు సభ్యులను టాస్ ద్వారా నిర్ణయించారు.