చిక్కడపల్లి, ఏప్రిల్ 1: హెచ్‌సీయూలో కొనసాగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అశోక్ నగర్ చౌరస్తా వద్ద నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. హెచ్‌సీయూలో భూములను లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎన్నో మూగజీవులు చనిపోతున్నాయని నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేశారు. సంఘీభావంగా మంగళవారం సాయంత్రం అశోక్ నగర్ చౌరస్తా వద్ద శాంతియుత క్యాండిల్ ర్యాలీని చేపడుతున్నట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా అభ్యర్థులకు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా జనార్దన్‌ను అదుపులో తీసుకున్నారు. అశోక్ నగర్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. విద్యార్థులు వస్తే అరెస్టు చేసి తరలించేందుకు పోలీస్ వాహనాలను ముందస్తుగానే ఏర్పాటు చేశారు.