హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం సచివాలయాన్ని ముట్టడించగా, మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు. కొనసాగింపుగా ఈ నెల 19న ‘చలో టీజీపీఎస్సీ శాంతియుత సత్యాగ్రహ దీక్ష’కు అభ్యర్థులు పిలుపునిచ్చారు. గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 పోస్టులు పెంచి, ఆగస్టులో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా వేయాలనే డిమాండ్‌తో దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు.
టీజీపీఎస్సీ నుంచి తమకు సానుకూలత రాకుంటే దీక్ష తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు తమను అరెస్టు చేసినా ఎక్కడికక్కడే దీక్షలు చేస్తూ ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీక్షకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.