ఎల్బీనగర్, జూన్ 12: పోలీస్ నిరుద్యోగ అ భ్యర్థులు శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లో మెరు పు ధర్నాకు దిగారు. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను ఐదువేల పోస్టులకు కాకుండా 20వేల పోస్టులకు ఇవ్వాలన్న డిమాండ్‌తో వారు దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగితే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందన్న భావనతో వారు తమకు మధ్యాహ్న భోజనం పెట్టే సాయిబాబా ఆలయాన్ని తమ ధర్నాకు కేంద్రంగా చేసుకున్నారు. వందల సంఖ్యలో రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయం సమీపంలోని సరూర్‌నగర్ పోలీసులకు తెలియడంతో వారు అక్కడికి వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. నిరుద్యోగులు కదలకుండా మొండికేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఒత్తిడికి లోనైన కొందరు విద్యార్థులు రోదించడం కనిపించింది. అయినప్పటికీ పోలీసులు పట్టువిడువకుండా వారిని చెదరగొట్టారు.
మూడు పోలీస్స్టేషన్లకు నేతల తరలింపు
పోలీస్ నిరుద్యోగుల ఆకస్మిక ధర్నాకు నేతృ త్వం వహించిన జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని మూడు వేర్వే రు పోలీస్స్టేషన్లకు తరలించారు. సరూర్‌నగర్‌తోపాటు చైతన్యపురి, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లలో వారిని నిర్బంధించారు. అరెస్టయిన వారిలో నిరుద్యోగ జేఏసీ నాయకులు అశోక్, ఇంద్రానాయక్, శ్రీనివాస్, భుక్యా కుమార్, రాంచందర్, నవీన్, శంకర్, ఆకాష్, శింబు, వంశీ, ఆస్మా, వినయ్, మహేందర్, భారత్, సోమేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం దారుణం: నిరుద్యోగ జేఏసీ నేతలు
సమస్యలు పరిష్కరించకుండా తమ హ క్కుల కోసం ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను అరె స్టు చేయడం దారుణమని నిరుద్యోగ జేఏసీ నాయకులు అశోక్, ఇంద్రానాయక్, భుక్యా కుమార్ పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం జరిగే ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.