మలక్‌పేట, మార్చి 25 : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు బుధవారం మెరుపు ధర్నాకు దిగారు. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులతోపాటు జీపీవో, మాడల్ స్కూల్, విద్యుత్తు, వ్యవసా య, అటవీశాఖలు సహా 26 విభాగాల్లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యాకుమార్, నిరుద్యోగుల సంఘం నాయకులు సోమేశ్ జాదవ్, నరేందర్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించి బస్‌స్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. సీఎం డౌన్‌డౌన్, చేతగాని సీఎం రాజీనామా చేయాలి.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందజేసి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ చెప్పడం సిగ్గుచేటని భూక్యాకుమార్, ఇంద్రానాయక్ విమర్శించారు. ఈ రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా అబద్ధాలు చెప్పుకుంటూ కాలాయాపన చేశారని మండిపడ్డారు. ఉద్యోగ వయో పరిమితిని 35 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారిన జీవో నంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ఇప్పటివరకు 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీలో కాలయాపన చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు నేతలను అరెస్ట్ చేసి మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్ పట్నాయక్, శింబూనాయక్ తదితరులు పాల్గొన్నారు.