కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని, 20 వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు విడుదల చేయాలని నిరుద్యోగులు సోమవారం కదంతొక్కారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ప్లకార్డులతో భారీ ర్యాలీ తీశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద సాయంత్రం మెరుపు ధర్నాకు దిగారు. ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం’, ‘వీ వాంట్ జస్టిస్’, ‘వాడెవ్వడు వీడెవ్వడు.. నిరుద్యోగులకు అడ్డెవ్వడు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిక్కడపల్లి ప్రధాన రోడ్డు వైపు ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
చిక్కడపల్లి, జూన్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని, 20వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. సోమవారం సాయంత్రం చిక్కడపల్లి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘5వేలు వద్దు.. 20వేలు ముద్దురా..’, ‘ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం’, ‘వీ వాంట్ జస్టిస్’, ‘వాడెవడు వీడెవ్వడు.. నిరుద్యోగులకు అడ్డెవ్వడు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిక్కడపల్లి ప్రధాన రోడ్డు వైపు ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. నిరుద్యోగులు కయ్య వెంకటేశ్, కిరణ్రాథోడ్, కుమార్, శ్రీకాంత్ తదితరులను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం అన్యాయమని మండిపడ్డారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణిచివేయలేరని.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 20వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల ఉద్యోగాలు భర్తీ చేయాలని పేర్కొన్నారు. జీవో 46ను రద్దు చేసి, కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 ఏండ్లు, ఎస్సై అభ్యర్థులకు 38 ఏండ్లకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.
ఓయూలో నిరసన ర్యాలీ
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఇరువై వేల ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలతో నోటిఫికేషన్, ఇరువై ఐదు వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాలను 5వేల నుంచి 20 వేలకు పెంచాలని కోరారు. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉపాధ్యాయ పోస్టులు నింపాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీని బొందపెడతామని హెచ్చరించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని పేర్కొన్నారు. జంగయ్య, రామకృష్ణ, శ్రీకాంత్, నాగేందర్, రాజు, కవిత, భార్గవి, సైదులు, తిరుపతి, వెంకటేశ్ పాల్గొన్నారు.