హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జీవో-46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. 2016, 2018, 2022లో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో 15 వేల పోలీస్ ఉద్యోగాలు ఇచ్చిందని, ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు.
నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగార్థులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని, ముఖ్యంగా ఆంధ్రా పోలీస్ అధికారి వీవీ శ్రీనివాస్‌రావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా తప్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని పోలీస్ నిరుద్యోగ బాధితులు ఆకాశ్, శంకర్, కల్యాణ్, వంశీ, నవీన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గురుకుల నియామకాల్లో డౌన్మెరిట్ను తక్షణమే అమలు చేయాలని గురుకుల 1:2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజాభవన్ వద్ద మెట్లపై కూర్చొని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా గురుకుల డీఎల్, జేఎల్, పీజీటీలకు కామన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించారని వాపోయారు. ఎంపీ ఎన్నికల హడావుడిలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించకుండా, అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల వేలాది మందికి అన్యాయం చేశారని మండిపడ్డారు. కోర్టు తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నియామకాల్లో తాత్సారం చేస్తూ ప్రభుత్వం, గురుకుల బోర్డు తమను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.