హైదరాబాద్, ఆగస్టు12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు నిరసనల తాకిడి తప్పడం లేదు. తమ సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాలు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిస్తున్నాయి. దీంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా నిరుద్యోగులూ మంగళవారం ‘చలో గాంధీభవన్’కు పిలుపునిచ్చారు. జాబ్‌క్యాలెండర్ ప్రకటించి, రూ.2లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్‌తో గాంధీభవన్ ముట్టడించేందుకు సిద్ధమయ్యారు.
పెద్దఎత్తున నిరుద్యోగులు రానున్నారనే సమాచారంతో ఉదయం నుంచే పోలీసులు గాంధీభవన్ పరిసరాల్లో మోహరించారు. గాంధీభవన్‌కు చేరుకున్న నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసేందుకు వచ్చిన తమను అరెస్ట్ చేయడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే నెరవేర్చాలని తాము అడుగుతున్నామని, శాంతియు త ఆందోళనను పోలీసులతో అణచివేయాలని చూడటమేంటని మండిపడ్డారు.