హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోదీ యువతను నమ్మించి మోసం చేశారని, భారతదేశమే బేరోజ్‌గార్ మేళాగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశాన్ని నిరుద్యోగ భారతంగా తయారుచేసిందే బీజేపీ అని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి నియామకాల గురించి మాట్లాడే నైతిక హకు లేదని విమర్శించారు. మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బీజేపీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 2014లో మోదీకి దేశప్రజలు ప్రధానిగా ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచే యువతకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. తొమ్మిదేండ్లలో ఏడాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాల నియామకాలు చేపట్టనందుకు యువతకు బేషరతుగా బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలను ఎత్తగొట్టిందే బీజేపీ
45 ఏండ్లలో ఎప్పుడూలేని నిరుద్యోగిత రేటు మోదీ హయాంలోనే నమోదైందని, ఇది సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ కన్నా ఎకువగా ఉద్యోగాలు భర్తీచేసినట్టు చెప్పారు. ఇప్పటికే 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా పూర్తికాబోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జాప్యానికి కారణమే బీజేపీ అని ధ్వజమెత్తారు. ‘లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసేలా పేపర్ లీకేజీకి పాల్పడింది మీ పార్టీ ఎంపీ బండి సంజయ్ అనుచరుడే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది’ అని ఆయన కిషన్‌రెడ్డికి గుర్తుచేశారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఒకనాడైనా విభజన హామీలపై నోరుమెదిపారా? అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి కేంద్ర సహాయ మంత్రికాదని.. నిస్సహాయ మంత్రి అని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీ దివాళాకోరుతనం
పదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసినన్ని ఉద్యోగాలను దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భర్తీ చేసిందా చెప్పాలని కిషన్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్డీఏ ప్రభుత్వం పదేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా తమను కిషన్‌రెడ్డి విమర్శించడం దివాళా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ వారిని రాజకీయాలకు వాడుకొనే కుట్రలకు ఇప్పటికైనా మానుకోవాలని కిషన్‌రెడ్డికి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వరంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టడంతోపాటు దేశంలోనే ప్రైవేటు రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని కిషన్‌రెడ్డి తెలుసుకొంటే మంచిదని హితవుపలికారు.