హాలియా, జూన్ 18: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందింది. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని, ఉమ్మడి జిల్లా పౌరుడిగా నల్లగొండ జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా’ అంటూ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా హాలియాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ సారథ్యంలో దశాబ్ది కాలంలోనే జరిగిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన చూసి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమైన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని కాంగ్రెస్ నాయకులు పెంచిపోషిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలోనే తరిమేసిందని వివరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోనికి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర కాదుకదా.. మోకాళ్ల మీద నడిచినా ప్రజలు వారిని నమ్మరని తెలిపారు. జిల్లా అభివృద్ధిపై అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.