ముదిగొండ, డిసెంబర్ 15 : పంచాయతీ ఎన్నికలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపొందడంతో ఓర్వలేక ఆమె ఇంటిపై కాంగ్రెస్ నాయకులు సోమవారం రాళ్ల దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ నాయకుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి సలీమున్నీసా బేగం విజయం సాధించారు.
సోమవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి ఆమె ఇంట్లో ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి సలీమున్నీసా ఇంటిపై రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ గ్రామ నాయకుడు ధర్మనాయుడిపై దాడికి తెగబడ్డారు. అతడి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు.
మరో బీఆర్ఎస్ నేత పాల్వంచ రాజేశ్పైనా దాడి చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి ఆందోళనకరంగా మారింది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆదివా రం సాయంత్రం తాము గెలిచిన తర్వాత కనీసం ర్యాలీ తీసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని, కానీ సోమవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి తమపై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఘటనపై ఇరువర్గాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. తమ గెలుపును కాంగ్రెస్ ఓర్వలేకనే దాడులకు దిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.