Paddy Procurement | మంచిర్యాల, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి పదిహేను రోజులు దాటినా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వర్షాలు పడే అవకాశముండగా, ధాన్యం తడిసి నష్టపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. నిబంధనలను అనుసరించి ధాన్యం కొనాలంటే తేమశాతం 17 ఉండాలి. కానీ తేమ 12 శాతం నుంచి 14 శాతానికి వచ్చినా కొనడం లేదంటూ మంచిర్యాల జిల్లా రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లి చూసినా కుప్పలుగా పోసిన ధాన్యపు రాశులు.. వాటికి కాపాలా కాస్తున్న రైతులే కనిపిస్తున్నరు. వారం క్రితం ధాన్యం కొనుగోళ్లు మొదలైనప్పుడు ధాన్యం తప్పనిసరిగా తూర్పారాబట్టాలని అధికారులు చెప్పారు. తూర్పారా పట్టలేదన్న కారణంతో లారీ లోడ్‌కు 15 బస్తాల నుంచి 20 బస్తాల ధాన్యానికి రైస్ మిల్లర్లు కోతలు పెట్టారు. దీంతో రైతులు ప్యాడీ క్లీనర్ యంత్రాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. తూర్పారా పట్టకపోతే బస్తాకు రెండు కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
యంత్రాలు మొరాయిస్తున్నాయని..
మంచిర్యాల జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా, ముందు 95, ఇటీవల మరో 49 ప్యాడీ క్లీనర్ యంత్రాలను సమకూర్చారు. కేంద్రాలకంటే యంత్రాలు తక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు.కొత్త యంత్రాలైనప్పటికీ అవి చాలావరకు పని చేయడం లేదు. మోటర్ కాలిపోయిందని చాలా కేంద్రాల్లో యంత్రాలను పక్కన పెట్టేశారు. మూడెకరాల్లో పండిన ధాన్యాన్ని క్లీన్ చేసేందుకు యంత్రం నాలుగు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుంది. దీంతో రైతులు ప్యాడీ క్లీనింగ్ కోసం నిరీక్షించాల్సి వస్తుంది. రోజుల తరబడి తూర్పారా పట్టడం కోసం సీరియల్ వారీగా ఎదురు చూస్తున్నామని… ఈ లోగా యంత్రాలు పని చేయకపోవడంతో చివరకు క్లీనింగ్ అవసరం లేదని 40 కిలోలు తూకం వేయాల్సిన బస్తాను 42 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు చెప్తున్నారు.
రెండు రకాలుగా నష్టం..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తున్న రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. ఎక్కువ తూకం వేస్తూ క్వింటాకు 10 కిలోలు తీసుకోవడం ఒకటైతే.. తేమశాతం తగ్గడం కూడా రైతులకు నష్టం తీసుకువస్తుం ది. ధాన్యం కోసి కేంద్రానికి తెచ్చి ఆరబోసిన మూడు నుంచి నాలుగు రోజుల్లో 17శాతం తే మ వస్తుంది. కానీ పదిహేను, ఇరవైరోజులుగా కొనుగోలు చేయకపోవడంతో తేమశాతం 11శాతం నుంచి 12 శాతానికి పడిపోయింది. కొన్ని చోట్ల తేమ శాతం 10 వస్తున్నది. దీంతో ధాన్యం బరువు తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. అన్ని రకాలుగా మిల్లర్లకు లాభం చేసేలా అధికారులు వ్యవహరిస్తున్నాంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు. తప్ప, తాలు పేరుతో కిలో ఎక్కువ తీసుకోడానికి తమకు అభ్యంతరం లేదని.. కానీ బస్తాపై రెండు కిలోలు తీసుకోవడం సరికాదని అంటున్నారు.
నిలువ నీడ లేదు.. తాగేందుకు నీళ్లు లేవు
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. తాగునీరు లేక గొంతెండిపోతున్నదని, కనీసం నీడ లేక చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుందని, వేడిగాలితో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలివానొస్తే టార్పాలిన్లు ఇచ్చేవారు కరువయ్యారు. విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయడకపోవడంతో వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వేసిన టార్పాలిన్లు దొంగలు ఎత్తుకుపోతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. – నర్సింహులపేట
వడ్లు కొనాలని రైతుల ఆందోళన
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం జాతీయ రహదారిని దిగ్బంధించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి, గుత్ప గ్రామాల రైతులు 63వ జాతీయ రహదారిపై అడవి మామిడిపల్లి వద్ద రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో నిజామాబాద్-ఆర్మూర్ మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది వాహనాలు బారులు తీరాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వలేదని, ఇప్పుడు పంట నష్టం జరిగితే ఆత్మహత్యలు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. మాక్లూర్ పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. –మాక్లూర్
తరుగు లేకుండా ధాన్యం కొనాలి
తరుగు తీయకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు రైతు సంఘాలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి ముజామిల్ ఖాన్, ఎస్సై భాగ్యరాజ్ అక్కడికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. జిల్లా అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, తరుగు లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
– వైరాటౌన్
కుప్పపోసి పెట్టి 10 రోజులు దాటింది
కేంద్రానికి ధాన్యం తెచ్చి 15 రోజులైతంది. ఐదు రోజులకే తేమశాతం 17 వచ్చింది. కుప్పపోసి పెట్టి 10 రోజులు దాటింది. వర్షం వస్తే ధాన్యం మొత్తం తడిసిపోతది. మొన్నటి దాకా తూర్పార పట్టమని చెప్పారు. అదే లేకపోతే ఈ పాటికి తూకం అయిపోయేది. పది రోజులుగా రోజూ పడిగాపులు కాయాల్సి వస్తుంది. వర్షాలు రాకముందే ధాన్యం కొనాలి.
– మోటపలుకుల చంద్రయ్య, గుళ్లకోట రైతు