మల్లంపల్లి, జూన్ 23 : క్షణికావేశంలో వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, తట్టుకోలేక ఆమె భర్త సైతం అదే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లాలో కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపల్లి మండలం శివతండాకు చెందిన సభావత్ పంతులు (70), సుగుణ(60) దంపతులు. ఐదు నెలల క్రితం పెద్ద కుమారుడు క్యాన్సర్తో చనిపోయాడు. నాలుగేండ్ల క్రితం చిన్న కుమారుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల గ్రామంలో వృద్ధ దంపతుల పెద్ద కోడలితోపాటు ఇంటి పక్కన ఉన్న దాయాదులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. తాము కట్టుకునే ఇంటికి 10 ఫీట్ల దారి కావాలని, ఇందుకోసం డబ్బులిస్తామని ఒత్తిడి చేయడంతో వృద్ధ దంపతులు నిరాకరించారు.
ఈ విషయంలో కొంత గొడవ జరగ్గా ఇంటి ఎదురుగా ఉన్న మరో వ్యక్తి తరచూ తమనే తిడుతున్నాడనే భావనతో సోమవారం ఊర్లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీకి పిలిపించగా వారు మందలించారు. భూమి విషయంలో నాలుగు రోజులుగా దాయాదులతో జరుగుతున్న గొడవకు తోడు ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి పంచాయితీ పెట్టించాడని, తమకు న్యాయం జరగడం లేదని, తమ బాధను అర్థం చేసుకునే వారు లేరని వృద్ధ దంపతులు తీవ్ర మనస్తాపం చెందారు. అనంతరం ఇంటికి వెళ్లి సుగుణ పురుగుల మందు తాగి పడిపోగా, అది చూసిన భర్త సభావత్ పంతులు సైతం అదే పురుగుల మందు తాగి పడిపోయాడు. గ్రామస్థులు వెళ్లి చూసే సరికే ఇద్దరు వృద్ధులు చనిపోయి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.