కురవి, అక్టోబర్ 4: జర్నలిస్టు వేధింపులను తట్టుకోలేక మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామ కార్యదర్శి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. కార్యదర్శి వంగూరి నాగలక్ష్మి రెండు పేజీల లేఖను రాసి పంచాయతీ కార్యాలయంలో దోమల మందు తాగింది. లేఖలో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. ‘గ్రామానికి చెందిన ఓ చానల్ రిపోర్టర్ దొంతు యాదగిరి కొద్దిరోజులుగా తనను టార్గెట్ చేశాడు. ఏ పనిచేసినా తప్పులు వెతికి పైఅధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడు. ఓటరు జాబితాను గత నెల 27న ఇవ్వాల్సి ఉండగా, 28న అధికారులకు అందజేశాను. ఆలస్యమైందని అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
ఆ నోటీసు నాకు అందకుండా వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఇలాంటి చర్యలతో నేను మానసికంగా ఇబ్బందులు పడుతున్నా. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’నని లేఖ రాసి, దోమల పిచికారీ మందు తాగింది. ఆత్మహత్యకు యత్నించే ముందు ఎంపీ వో గౌస్‌కు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే ఆయన తట్టుపల్లికి చేరుకొని నాగలక్ష్మిని దవాఖానకు తరలించా రు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో వీరబాబు దవాఖానకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎంపీడీవోను వివరణ కోర గా ఓటరు జాబితా ఆలస్యం కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చిన మాట వాస్తవమేనని, కార్యదర్శిని ఏ అధికారి వేధించలేదని స్పష్టం చేశారు. కార్యదర్శికి న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు రాములు అధికారులను కోరారు.