Telangana | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండగ వేళ తెలంగాణలో యూబీ బ్రాండ్ (కింగ్ఫిషర్, బడ్వైజర్) బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏ4 మద్యం దుకాణాలకు, బార్లకు కింగ్ఫిషర్ బీర్లను ఇవ్వవద్దని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం డిపో మేనేజర్లను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యూబీ ఉత్పత్తుల అమ్మకాలు జరుపొద్దని ఆదేశించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిపోలలో కింగ్ఫిషర్, క్వీన్ఫిషర్, హీనెకెన్, ఆమ్స్టెల్ బ్రాండ్ల విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయాయి.
సిండికేట్గా ప్రమోట్..?
యూబీ కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిన నేపథ్యంలో పాత బకాయిలు ఇచ్చి, బేసిక్ ధరలు పెంచే వరకు రాష్ట్రంలో తమ బీర్లను సరఫరా నిలిపివేస్తామని యూబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి, నిర్దిష్ట బీరు ఉత్పత్తులను రాష్ట్రంలో ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో బడ్వైజర్ బీర్లను అడ్డుకుంటున్నట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రింగ్లీడర్ వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రంలో కింగ్ఫిషర్, బడ్వైజర్ బీర్లకే 60 శాతం మారెట్ ఉన్నది. సంక్రాంతి నేపథ్యంలో ఈ బ్రాండ్స్ 80 శాతం మేర మారెట్ను ఆక్రమిస్తాయని అంచనా. మద్యం గోదాముల్లో, జిల్లా డిపోల్లో కలిపి 14 లక్షలకు పైగా కింగ్ఫిషర్ బీర్ కేసులు ఉన్నాయి. పండుగకు ఈ స్టాక్ సరిపోతుందని, ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ వీటి స్థానంలో కొత్త బ్రాండ్లను ప్రోత్సహించేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం జోరుగా సాగుతున్నది. అందులో భాగంగానే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీ, నాకౌట్, హైవార్డ్స్ 5000, ఖర్జూర తదితర బీరు బ్రాండ్లను ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది.