Kaleshwaram | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపెడుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రాజకీయ కుట్రలు పన్నుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ మండిపడ్డారు. భారీ డ్యామ్‌ల నిర్మాణాల్లో పనిచేసిన అనుభవం, కనీస అవగాహన లేని కొందరు ఇంజినీర్లు రాజకీయ పార్టీలతో చేరి అసత్య ప్రచారాలు చేస్తూ, తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టులు, బరాజ్‌లలో ప్రమాదాలు అత్యంత సహజమని, ప్రపంచవ్యాప్తంగా గతంలో ఇలాంటి ఘటనలు అనేకమున్నాయని వివరించారు. ఆదివారం ఓ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వీ ప్రకాశ్ మాట్లాడారు. బరాజ్ కుంగుబాటుపై సాగుతున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో కుట్రపూరితంగా గోదావరిపై బరాజ్‌లు, ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు తెలంగాణ సర్కారు అనేక నిర్మాణాలను చేపట్టిందని, నీళ్లను మళ్లించి బీళ్లకు అందిస్తున్నదని వివరించారు.
మన ప్రాజెక్టులపై ఆంధ్ర ఏజెంట్ల కుట్రలు..
తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్ర ఏజెంట్లు కుట్రలు పన్నుతున్నారని, వాటిని ఏకారణంగానైనా నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని వీ ప్రకాశ్ ధ్వజమెత్తారు. కనీస అవగాహన లేని తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర ఏజెంట్ల కుట్రలో భాగమవుతున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత వేగంగా వరదలు సంభవించే నదుల్లో గోదావరి ఒకటని, నదీగర్భం మార్పులకు లోనవుతుంటుందని వెల్లడించారు. సమగ్ర అధ్యయనం చేస్తే తప్ప కారణాలను తెలుసుకోలేమని, ఎన్డీఎస్ఏ అవేవీ చేయకుండా కేవలం ఉపరితల పరిశీలన ద్వారా నివేదిక ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లను ఆమోదించింది కేంద్రమేనని, నాణ్యాతను, నిర్మాణాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిందని గుర్తుచేశారు. ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డంపెట్టుకుని ప్రజాప్రయోజనార్థం నిర్మించిన ప్రాజెక్టులపై రాజకీయపార్టీలు సైతం విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, బరాజ్‌లకు ఎలాంటి ఢోకా లేదని, పునరుద్ధరించి యథావిధిగా యావత్ తెలంగాణకు జలఫలాలను అందిస్తుందని స్పష్టంచేశారు.