వనపర్తి, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర స్థాయిలో సంచలనమైన బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి రెండేండ్లు పూర్తయినా పోలీసుల దర్యాప్తు కొలిక్కి రాకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తున్నది. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి.. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. రాష్ట్ర స్థాయిలో ఈ హత్య ఘటన దుమారం లేపింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ దాడుల పరంపర పెరిగింది. 2024 మే 22 అర్ధరాత్రి తన ఇంటిని అనుసరించి ఉన్న కల్లం దొడ్డిలో నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఎలాంటి రాజకీయ పదవుల్లోనూ లేకపోవడం.. వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరున్న ఆయన హత్య కేసు పోలీసులకు సవాల్‌గా నిలిచింది.
ఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. హత్య సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అనేక రాజకీయ ఆరోపణలు వెలువడ్డాయి. వీటన్నిటిపై పోలీస్ యంత్రాంగం పరిశీలనలు జరుపుతూనే ఉన్నది. కుటుంబసభ్యులు లేవనెత్తిన అంశాలను సైతం పరిగణలోకి తీసుకున్నారు. దోషులను వెంటనే గుర్తించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పలుదఫాలుగా పోలీసు అధికారులను కలిసి విజ్ఞప్తిచేశారు.
శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి రెండేండ్లయినా పోలీసులకు హంతకులు చిక్కడం లేదంటే వారి ప్లానింగ్ ఎలా ఉందో అర్థమవుతున్నది. ఘటనాస్థలిలో ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడం, డాగ్ స్కాడ్ పరిశీలనలోనూ సాక్ష్యాలు దొరక్కపోవడంతో దర్యాప్తులో పురోగతి లేకుండాపోయింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ ప్రత్యర్థులు, మహిళలు, హితులు, సన్నిహితులను పోలీసులు ఆరా తీశారు. శ్రీధర్ ఫోన్‌తోపాటు అనుమానితుల ఫోన్లను పరిగణలోకి తీసుకొని విచారణ సాగించారు. శ్రీధర్‌రెడ్డిని హత్య చేసిందెవరు..? ఎందుకు చేశారు..? అన్న ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకడంలేదు.
దారుణంగా హత్యకు గురైన శ్రీధర్‌రెడ్డి కేసును కావాలనే డీలా చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. శ్రీధర్ కుటుంబసభ్యులు సైతం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులను కలిసి అప్పట్లోనే కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను కలిసి హంతకులను పట్టుకోవాలని విజ్ఞాపనలు అందజేశారు. కేసు డీలాపై బీజేపీ నాయకులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంవరకు వెళ్లారు. దీంతో 2024 జూలై 17న మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ లక్ష్మీపల్లి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని తెలసుకున్నారు. అయినా ఇప్పటి వరకు కేసు కొలిక్కి రాలేదు.
శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నది. అనుమానితులందరినీ విచారణ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకుంటాం. కొంత ఆలస్యం అయినప్పటికీ హంతకులను గుర్తించే పనిలోనే ఉన్నాం.
– కేఎస్ రత్నం, సీఐ, వనపర్తి