లింగాల ఘనపురం: జనగామ జిల్లా లింగలఘనపురం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను హత్యచేశారు (Murder). లింగాలఘనపురం మండలంలోని ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంకు చెందిన కాల్య కనకయ్య (30)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మద్యానికి బానిసైన కనకయ్య తరచూ తన ఇద్దరు భార్యలను వేధిస్తుండేవాడు.
ఈ క్రమంలో మే 18న నల్లగొండ జిల్లాలోని ఓ తోటలో తన రెండో భార్య శిరీష తల్లి జన్నువాయిని తాగిన మైకంలో హత్య చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ.. భార్యలను, గ్రామస్థులను బెదిరిస్తుండేవాడు. సోమవారం రాత్రి గ్రామానికి వచ్చిన కనకయ్య భార్యలతో గొడవపడ్డారు. వారిని గొడ్డలితో బెదిరించాడు. దీంతో ఎదురుతిరిగిన ఇద్దరు భార్యలు అదే గొడ్డలితో భర్తను హత్య చేశారు. అనంతరం దేవాదుల కాలువలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.