జనగామ, జూలై 8 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనబావి శివారులోని పిట్టలోనిగూడెంలో భర్తను ఇద్దరు భార్యలు కలసి హతమార్చారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం .. గూడేనికి చెందిన కాలియ కనకయ్య (30) అదే గ్రామానికి చెందిన గౌరమ్మను మొదట వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన చుక్కమ్మ అలియాస్ శిరీషను రెండో భార్యగా పరిణయమాడాడు. శిరీషకు బబ్లూ అనే కుమారుడు జన్మించాడు. మద్యానికి బానిసైన కనకయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానంటూ భార్యలిద్దరినీ వేధించేవాడు.
శిరీష తల్లిదండ్రులు ఈ విషయంపై కనకయ్యను మందలించారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో ఓ తోటకు కావలిగా ఉన్న శిరీష తల్లిదండ్రులు జున్నుబాయి-చినరాజయ్య దంపతులపై మే 18న కనకయ్య దాడిచేశాడు. జున్నుబాయిని హత్య చేసి, చినరాజయ్యను గాయపరిచి గూడెనికి వచ్చి ఇద్దరు భార్యలను తీసుకొని పారిపోయాడు. 15రోజుల క్రితం దుబ్బాకలో ఉన్న ఇంటికి గూడెంవాసులు వెళ్లగా .. కనకయ్య పారిపోయాడు. దీంతో గ్రామస్థులు గౌరమ్మ, శిరీషను గూడెనికి తీసుకొచ్చారు.
సోమవారం రాత్రి కనకయ్య గూడెనికి వచ్చి భార్యలిద్దరిపై గొడ్డలితో దాడి చేస్తుండగా వారు ప్రతిఘటించారు. సర్ది చెప్పేందుకు వచ్చిన శిరీష, గౌరమ్మ అన్నలు జనార్దన్, శ్రీనుపై కూడా దాడికి దిగాడు. దీంతో శిరీష గొడ్డలితో, గౌరమ్మ పునాదిరాయితో కనకయ్యపై దాడిచేసి హత్యచేశారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న దేవాదుల కాల్వలో పడేశారు. విషయం తెలుసుకున్న జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనగామ దవాఖానకు తరలించారు. నిందితులు శిరీష, గౌరమ్మ, సహకరించిన జనార్దన్, శ్రీనును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తుచేస్తున్నారు.