దామరచర్ల, అగస్టు 1: కేసీఆర్ మానస పుత్రిక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీపీ) స్టేజ్-1లో రెండు యూనిట్లను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే జనవరి వరకు యాదాద్రి ప్లాంట్‌లోని అన్ని యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని వైటీపీపీలో 730 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు భూమిపూజ చేశారు. వనమహోత్సవం కింద ప్లాంటులో మొక్కలు నాటారు. అనంతరం భట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్లాంట్ స్టేజీ -1లోని రెండు యూనిట్లను ప్రారంభించామని, స్టేజీ-2లో మిగతా యూనిట్లను జనవరిలో ప్రారంభిస్తామని తెలిపారు.
ప్లాంట్‌లో పనిచేసే సీఈ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, పరిశ్రమకు తోడ్పాటునందించిన గ్రామస్తుల పిల్లల ఉన్నత చదువు కోసం ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల కోసం దవాఖాన, అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. సిబ్బంది క్వార్టర్లుకు భూమిపూజ చేసినట్టు చెప్పారు. పెద్ద వాహనాల రవాణాతో గ్రామాల్లో ప్రత్యేకంగా సీసీరోడ్డు వేస్తున్నామని తెలిపారు. నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీతో పాటు యాదాద్రి ప్లాంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి ప్లాంట్, పులిచింతల నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలుపడంపై జిల్లా మంత్రిగా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యాదాద్రిలో నిర్వాసితులతో పాటు స్థానికంగా అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
నిర్దేశించిన సమయంలో పూర్తిచేయాలి
వచ్చే జనవరి వరకు స్టేజీ-2 ప్లాంటు పనులను పూర్తిచేసి జనవరి 26 నుంచి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. పవర్ ప్లాంటులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడే విష్ణుపురం డబుల్ లైన్ మంజూరైనా పనులు పూర్తికాలేదని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి రూ.280 కోట్లు మంజూరు చేయడమే కాకుండా క్లియరెన్స్ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ఇందన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సీఎండీ హరీశ్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర, హైడల్ డైరక్టర్ బాలరాజు, కోల్ డైరక్టర్ నాగయ్య, థర్మల్ డైరక్టర్ వై రాజశేఖర్‌రెడ్డి, సివిల్ డైరక్టర్ అజయ్ పాల్గొన్నారు.