నిర్మల్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇద్దరు టీచర్లతోపాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం తెలిపారు. పాఠశాలలో గణితం బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్‌రెడ్డి, ఇంగ్లిష్ టీచర్ మోహన్‌రావు ఇటీవల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులు రావడంతో వారిని విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయడంలో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడు కిషన్‌రావును కూడా సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. వీరిపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
టీశాట్‌లో గ్రూప్ -డీపై ప్రత్యేక ప్రసారాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఆర్ఆర్బీ, గ్రూప్ -డీ ఉద్యోగాలపై మంగళవారం నుంచి టీ శాట్‌లో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. జనరల్ సైన్స్, గణితం, రీజనింగ్, కరంట్ ఆఫైర్స్ సబ్జెక్టులపై 200 ఎపిసోడ్స్ ప్రసారం చేస్తామని తెలిపారు. టీ శాట్ నిపుణ ఛానల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు, విద్య ఛానల్లో ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రసారాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.