చౌటుప్పల్, మే30 : గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.35 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఎన్.శ్రీనివాస్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వట్టూరి సూర్యసంపత్(23), రాజమండ్రికి చెందిన తీగల దీపక్ఫణీంద్ర స్నేహితులు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కొంత కాలం నుంచి వీరు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28న గోవాకు వెళ్లి నిషేధిత ఎండీఎంఏ 25పిల్స్, ఎల్ఎస్డీ-2 డ్రగ్స్‌ను తీసుకొని హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన దిగారు.
ఈ డ్రగ్స్‌ను తీసుకొని లారీలో రాజమండ్రికి వెళ్తుండగా సోమవారం చౌటుప్పల్‌లో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.35 వేల డ్రగ్స్‌తోపాటు రూ. లక్ష విలువైన మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్ఐ అనిల్ ఉన్నారు.