హైదరాబాద్, అక్టోబర్ 22 (నమసే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గ్రూప్-1తోపాటు ఇతర ఉద్యోగాల్లో క్రీడల కోటా అమలు చేయాలని తెలిపింది. అనుబంధం-1, 2ల్లో పేరొన్న క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పిస్తూ రెండు శాతం క్రీడా కోటా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పింది. గ్రూప్-1 నియామకాలకు కేవలం అనుబంధం-1లో ఉన్న 23 విభాగాల క్రీడాకారులే అర్హులని పేరొనడం సరికాదని తేల్చింది. 2018లో జారీఅయిన జీవోలు 107, 5లతోపాటు 2012 జీవో 74ను పరిగణనలోకి తీసుకోలేదని, గ్రూప్-1తోపాటు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో క్రీడా కోటాను అమలు చేయలేదంటూ దాఖలైన సుమారు 25 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు తీర్పు చెప్పారు.
గ్రూప్-1 పోస్టులను తకువ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు కేటాయించరాదన్న ప్రభుత్వ, టీజీపీఎస్సీల వాదనను తోసిపుచ్చారు. ఉద్యోగ నియామక కనీస విద్యార్హత డిగ్రీగా నిర్ణయించినప్పుడు దాంతోపాటు క్రీడల కోటా అదనపు అర్హత అవుతుందని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులకు అనుబంధం-1 ప్రకారం అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నవారే అర్హులన్న వాదన చట్టవ్యతిరేకమని చెప్పారు. అనుబంధం-1,2గా వర్గీకరణ చేయడాన్ని క్రీడల సర్టిఫికెట్లలో అక్రమాలను అడ్డుకోవడానికేనని చెప్పారు. గతంలో జీవోలు 74, 107, 5లకు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మధ్యంతర ఉత్తర్వులతో ఖాళీగా ఉంచిన పోస్టుల్లో పిటిషనర్లను నియమించాలని ఆదేశించారు. ఖాళీలను అర్హులైనవారితో భర్తీ చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే నియామాకాలు చేసుం టే వాటి జోలికి వెళ్లరాదని, భవిష్యత్లో 2శాతం కోటా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.