హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఫాలన్ కుంభకోణంలో మరో ఇద్దరి ని అరెస్టు చేసినట్టు సీఐడీ డీజీ శిఖా గోయెల్ ప్రకటించారు. రబీంద్ర ప్రసాద్ సింగ్ (63), సుస్మరాజ్(31)ను శనివారం అదుపులోకి తీసుకున్నట్టు ఆదివారం వెల్లడించారు. వీరు తెలంగాణ నుంచి బీహార్‌కు వెళ్లి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారని, ఈ ఇద్దరు నిందితుల నుంచి రూ.8 లక్షల నగదు, 9 మొబైల్ ఫోన్లు, 2 ట్యాబ్‌లు, బ్యాంక్ కార్డులు, చెక్‌బుక్‌లు, ఆస్తి పత్రాలు, పాస్‌పోర్టులు, ఇతర గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను సీజ్ చేసినట్టు ఆమె వివరించారు.
క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ‘ఫాలన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్’ అనే అప్లికేషన్ ద్వారా నిందితులు 7,056 మంది నుంచి రూ.4,215 కోట్లు వసూలు చేసినట్టు సీఐడీ పేర్కొన్నది. వీరిలో 4,065 మందిని రూ.792 కోట్ల మేర మోసగించినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ‘క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్’ సీఈవో యోగేంద్ర సింగ్‌ను ఈ నెల 6న అరెస్టు చేశారు.