Falcon Capital Ventures | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి, నిండా ముంచిన ఓ ముఠా గుట్టురట్టయింది. 6979 మంది డిపాజిటర్ల నుంచి రూ.850 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ఘరానా ముఠాకు చెందిన ఇద్దరిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ కే ప్రసాద్ కథనం ప్రకారం అమర్దీప్ కుమార్ 2021లో ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. డిపాజిటర్లను ఆకర్షించేందుకు మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్‌ను రూపొందించాడు.
తాము అమెజాన్, బ్రిటానియా, గోద్రేజ్ వంటి పేరొందిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని నమ్మబలికారు. ఎవరైనా రూ.25వేల నుంచి రూ.9లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని, ఏడాదికి 11 నుంచి 22 శాతం లాభం ఇస్తామని ప్రచారం చేశాడు. మొత్తం 6979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1700 కోట్లు పెట్టుబడి రూపంలో వసూలు చేశాడు. వీటిని వివిధ రూపాల్లో 14 కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపాడు. కానీ ఇందులో కొన్ని నకిలీ ఒప్పందాలుగా పోలీసులు తేల్చారు.
కంపెనీ యజమానులు కొందరు డిపాజిటర్లకు రూ.850 కోట్లు తిరిగి చెల్లించగా ఇంకా రూ.850కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిందితులపై గతంలోనూ మల్టీలెవల్ మార్కెటింగ్ కింద కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓదెల పవన్‌కుమార్, డైరెక్టర్‌గా పనిచేస్తున్న నెల్లూరి కావ్యను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని డీసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ కేసును ఏసీపీ కళింగరావు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.