ఆత్మకూరు, ఏప్రిల్ 22: సరదాగా స్నానం చేయడానికి జూరాల కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. నలుగురు చిన్నారులతోసహా ఇద్దరు పెద్దలను స్థానికులు ఈ ప్రమాదం నుంచి కాపాడారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్‌కు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ రాజేంద్రప్రసాద్(43) ఆత్మకూరులోని జెన్కో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. రాజేంద్రప్రసాద్ తోడల్లుడు శ్రావణ్‌కుమార్(34), బావమరిది క్రాంతి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం పట్టణ శివారులోని జూరాల ఎడమకాలువ వద్ద సరదాగా స్నానాలు చేసేందుకు ఆరుగురు పెద్దలు, ఆరుగురు చిన్నారులు కలిసి రెండు కార్లలో వెళ్లారు.
కాలువ వద్ద ఉన్న ఘాట్‌లో స్నానాలు చేసేందుకు రాజేంద్రప్రసాద్, శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యులు నీటిలోకి దిగారు. స్నానాలు చేస్తున్న చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఎవరికీ ఈత రాకపోవడంతో కేకలు వేశారు. స్థానికులు బాలు, ఆరెపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు, నాగరాజు కాలువలోకి దూకి రాజేంద్రప్రసాద్ భార్య స్వాతి, కూతురు సహస్ర(9), కుమారుడు ఆదిత్య (7)ను, శ్రావణ్‌కుమార్ భార్య నిహారిక, కుమారులు వివేక్, విశాల్‌ను కాపాడారు. రాజేంద్రప్రసాద్, శ్రావణ్‌కుమార్ గల్లంతయ్యారు. పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజేంద్రప్రసాద్ బావమరిది క్రాంతి కుటుంబ సభ్యులు నలుగురూ కాలువలోకి వెళ్లకుండా ఒడ్డుపైనే ఉన్నారు. దీంతో వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కేఎస్ రత్నం తెలిపారు.