హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారులు అరెస్టయ్యారు. ప్రణీత్‌రావు పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. విచారణలో భాగంగా పోలీసులు ప్రస్తుత భూపాలపల్లి ఓఎస్డీ భుజంగరావు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నను అదుపులోకి తీసుకొన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పొలిటికల్ వింగ్ అదనపు ఎస్పీగా పనిచేసిన భుజంగరావు, ప్రస్తుతం ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో కలిసి ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి ఆ ఇద్దరితోపాటు, ఒక న్యూస్ చానల్ అధిపతి, మాజీ అధికారి రాధాకిషన్‌రావు ఇండ్లల్లో పోలీసులు సోదాలు జరిపారు. అనంతరం భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. వీరిద్దరినీ ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్ట నున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, మాజీ పోలీస్ అధికారులకూ పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారని, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పోలీస్అధికారులు, మాజీ అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.