తిమ్మాజిపేట/మల్హర్, జూలై 5: పంట దిగుబడులు లేక.. అప్పులు తీర్చే మార్గం లేక నాగర్‌కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బుద్ధసముద్రం గ్రామానికి చెందిన రైతు కావలి రామాంజనేయులు (40)కు రెండెకరాల పొలం ఉన్నది. నిరుడు వరి సాగు చేయగా.. మరో మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. తెగులు సోకి దిగుబడి అంతంత మాత్రమే రావడంతో దాదాపు రూ.3.50 లక్షల అప్పు మిగిలింది. దీనికితోడు ఓ బ్యాంకులో రూ.లక్షకుపైగా క్రాప్ లోన్ తీసుకున్నాడు.
రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసినా సదరు రైతుకు వర్తించలేదు. దీంతో దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. వీటిని తీర్చే మార్గం లేక కుంగిపోయాడు. ఈ క్రమంలో గత నెల 21న తన వ్యవసాయ పొలం వద్ద కలుపు మందు తాగి ఇంటికి వెళ్లి వాంతులు చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు జడ్చర్ల దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరుసటి రోజు మహబూబ్‌నగర్‌కు.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు.
నాచారంలో కౌలు రైతు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన బండారి దేవేందర్ (30) గత కొన్నేండ్లుగా మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కౌలుకు తీసుకున్న భూమిలో రెండేండ్లుగా మిర్చి సాగు చేస్తున్నాడు. పంట చీడపీడల బారిన పడి దిగుబడి రాక, ధర లేక వరుసగా నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో పంట సాగు కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. అప్పులు తీర్చేమార్గం కానరాక తరచూ బాధపడేవాడు. జీవితంపై విరక్తితో శుక్రవారం మధ్యాహ్నం దేవేందర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే వారు బైక్‌పై భూపాలపల్లి వందపడకల వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.