జైనథ్/గజ్వేల్, మే 19 : దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు, రీజినల్ రింగ్ రోడ్డులో భూమి పోతున్నదని సిద్దిపేట జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సుందరగిరి గ్రామానికి చెందిన రైతు కొక్కుల లచ్చన్న (56) తనకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి వేశాడు. సాగుతోపాటు బిడ్డ పెండ్లికి రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడం, పత్తి పంటకు ధర లేక తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. దీంతోపాటు ఆయనకున్న రెండున్నర ఎకరాలు పోడు భూమి కావడం, దానికి పట్టా లేకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సుందరగిరి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లచ్చన్న భార్య ప్రేమల ఫిర్యాదు మేరకు ట్రైనీ ఎస్సై రమ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డులో వ్యవసాయ భూమిపోతుందనే బెంగతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మక్తమాసాన్పల్లికి చెందిన రైతు ఇసకంటి నర్సింహులు (45)కు రెండు ఎకరాల భూమి ఉన్నది. వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం దాదాపు ఎకరన్నర కంటే ఎక్కుతే పోతుందని, దాదాపు ఉన్న భూమి అంతా పోతే సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్రమనస్తాపం చెందాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.