దుగ్గొండి/మనోహరాబాద్, మార్చి 3: సరైన దిగుబడులు లేక.. అప్పులను తీర్చలేక మనస్తాపంతో ఓ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు వరంగల్, మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన వెంకటయ్య, గంధం లక్ష్మి (52) దంపతులు. వీరికి రెండు ఎకరాలు ఉండగా పత్తి సాగు చేశారు. కాగా ఓ రైతుకు చెందిన 6 ఎకరాలు కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో మిర్చి, మరో మూడు ఎకరాల్లో మక్క జొన్న సాగుచేశారు. సరైన దిగుబడులు రాక రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఈ క్రమంలో గత నెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త వెంకటయ్య ఇంటికి వచ్చి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మిని వెంటనే నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో మెదక్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్కు చెందిన రైతు పిట్ల రాజు (44)కు ఎకరం పొలం ఉండేది. సాగు కలిసి రాకపోగా, దిగుబడి లేక పోవడంతో ఇంటి నిర్మాణం కారణంగా అప్పుల పాలయ్యాడు. దీంతో ఉన్న ఎకరం భూమి కూడా అమ్ముకున్నాడు. ఇటీవల పెద్ద కుమార్తెకు పెండ్లి కుదిరింది. ఆర్థిక ఇబ్బందులతో కొద్దిరోజులుగా ఆందోళనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన సోమవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లిచూడగా చెట్టుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.