కొత్తగూడెం అర్బన్, జూలై 27: యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసినది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అత్యవసర కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన సమీక్షాసమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ఈ సమీక్షలో తొలుత డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు అందించేందుకు యూరియా కొతర లేదని స్పష్టం చేశారు. ఆర్వోఎఫ్ఆర్ పోడు భూముల్లో పంటలు సాగుచేసుకుంటున్న రైతుల వద్దకు పోలీసులు, ఫారెస్టు అధికారులు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు.అంతకు గంట ముందే ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితోకలిసి అదే కలెక్టరేట్లో మంత్రి తుమ్మల ప్రెస్మీట్ పెట్టారు. రైతుల అవసరాలను తీర్చేందుకు రాష్ర్టానికి అదనంగా మూడు లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాసినట్టు చెప్పారు.