కుమ్రంభీం ఆసిఫాబాద్ : నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు సానుభూతిపరులను కుమ్రంభీం ఆసిఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ తెలిపారు. శనివారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం జిల్లేడ గ్రామానికి చెందిన కోట ఆనంద్‌రావు, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోరిటికల్ గ్రామానికి చెందిన చెన్నగోని గణేశ్ అలియాస్ అభిరాం ను శుక్రవారం కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు, పెంచికల్పేట్ పోలీసులు ఆగర్ గూడ గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారని తెలిపారు. మావోయిస్టు దళానికి పేలుడు పదార్థాలు, పార్టీ పత్రాలను బెజ్జూర్ అటవీ ప్రాంతంవైపు తీసుకెళ్తుండగా వీరిని పట్టుకుని విచారించగా వివరాలు వెల్లడించారని ఎస్పీ పేర్కొన్నారు.
కోట ఆనంద్‌రావు ప్రజా సంఘాలలో పని చేస్తూ సీపీఐ మావోయిస్ట్(CPI Maoist) పార్టీ దళంలో చేరే వ్యక్తులను ప్రోత్సహిస్తూ రిక్రూట్‌కు పాల్పడుతున్నాడని ఆయన వివరించారు. మావోయిస్టులు వచ్చినప్పుడు వారికి వస్తువులు కొనిపెట్టటం, వాటిని సరఫరా చేయడం, భోజనం పెట్టటం, మిలిటెంట్ లను పార్టీకి అనుకూలంగా పని చేసే విధంగా చేస్తున్నారని తెలిపారు. పార్టీ తరుపున కాంట్రాక్టర్ ల వద్ద డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆనందర్‌రావు మావోయిస్టు నేతలతో పరిచయాలు కూడా ఉన్నాయని తెలిపారు. గణేశ్‌ను దళంలో చేర్పించే యత్నంలో భాగంగా దళం వద్దకు వెళ్తున్న సమయంలో వీరిని పట్టుకున్నామని తెలిపారు.
ఇద్దరి వద్ద నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, విప్లవ సాహిత్యం, మొబైల్ ఫోన్, మోటర్ సైకిల్ స్వాధీన పరుచుకున్నామని వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు, పెంచికల్ పేట్ ఎస్ఐ విజయ్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ సోనియా తదితరులు పాల్గొన్నారు.