కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు భారీ దోపిడీలు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు సవాల్ విసిరాయి. దొంగలు మాస్కులు ధరించకుండా తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో దోపిడీలకు పాల్పడటం భద్రతా వైఫల్యాన్ని కండ్లకు కడుతున్నది. గతనెల 11న రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట ఎస్బీఐ ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీస్ పెట్రోలింగ్ జరుగుతున్నా దొంగలు భయపడకుండా తమ పని పూర్తిచేసుకొని వెళ్లిపోగా.. నేటివరకు వారిని పట్టుకోలేకపోయారు. తాజాగా ఆదివారం పట్టపగలే పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ చేయడంతోపాటు ప్రతిఘటించిన నలుగురు సిబ్బందిపై కాల్పులు జరిపిన ఘటనతో కరీంనగర్ ఉలిక్కి పడింది. ఈ నగల దుకాణం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే ప్రథమం కాగా, వందల కెమెరాలను దాటొచ్చి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సవాల్ విసురుతున్న దొంగలు
నెల రోజుల్లో రెండు భారీ దోపిడీలకు పాల్పడిన దొంగలు పోలీసులకు సవాలు విసరుతున్నారు. సిరిసిల్లలో ఓవైపు పోలీసులు గస్తీ తిరుగుతుండగా, పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఏటీఎంను పగులగొట్టి.. అక్కడి మిషన్‌ను ఎత్తుకెళ్లారు. కరీంనగర్లో పీఎంజే నగల దుకాణంలో దోపిడీ పకడ్బందీగా జరిగినట్టు తెలుస్తున్నది. దోపిడీకి పాల్పడేముందు దుండగులు మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడిన దుండగులు 12 నిమిషాల్లో తమ పని ముగించుకొని వెళ్లిపోవడం నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నది. ఘటన జరగడానికి పది నిమిషాల ముందే మంత్రి బండి సంజయ్ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన నేపథ్యంలో.. సాధారణంగా ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు పటిష్ఠంగా ఉండాలి. కానీ దొంగలు ఏమాత్రం భయం లేకుండా నగల దుకాణంలో చొరబడి, సిబ్బందిపై కాల్పులు జరిపి మోటార్ సైకిళ్లపై తప్పించుకొని పారిపోయారు.
ఉత్తర భారతీయులే?
దుండగుల మాటలను బట్టి వారు ఉత్తర భారతదేశానికి చెందినవారై ఉండచవ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది హిందీలో, మరికొందరు తెలుగులో మాట్లాడినట్టు తెలుస్తున్నది. దుండగులు అపాచీ , పల్సర్ బైక్‌లపై శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్లవైపు పారిపోయినట్టు భావిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులపై తనిఖీ చేపట్టారు. ఘటనాస్థలం నుంచి బుల్లెట్ షెల్స్, మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సీపీ గౌస్ఆలం ప్రకటించారు.
నాకాబందీ నిర్వహించిన 12 గంటల్లోనే..
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శనివారం పోలీస్ అధికారులు నాకాబందీ, స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దుండగలు మూడురోజుల ముందుగానే కరీంనగర్‌కు వచ్చి మకాం వేసినట్టు తెలుస్తున్నది. దొంగలు నగరంలోనే మకాంవేసినా పోలీసుల నిఘా ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వచ్చింది ఉగ్రవాదులా..?
పీఎంజే జ్యువెల్లరీలో క్లూస్ టీం పలు కీలక ఆధారాలు సేకరించినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఐదుగురు దుండగులలో ఒకరు మాత్రమే మాస్కు వేసుకున్నారు. నలుగురు మాస్కులు ధరించలేదు. ఈ ఫొటోలను సేకరించిన పోలీసులు వారిని మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తుల ముఠాగా గుర్తించినట్టు తెలుస్తున్నది. నిందితులంతా విదేశీ తుపాకులు వినియోగించడం, సిబ్బందిని తాళ్లతో కట్టేసి, బందీలను మోకాళ్ల మీద నిలబట్టడం వంటి అంశాలను మరో కోణంలో చూస్తున్నారు. దుండగులు ఉగ్రశిక్షణ పొందారా? అన్న అనుమానాలు ఉన్నాయని ఓ పోలీస్ అధికారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కూత వేటు దూరంలోనే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆఫీసు ఉండడంతో ఐబీ కూడా ఘటనపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
ఫైన్లకే పరిమితమైన కమాండ్ కంట్రోల్
కరీంనగర్లో స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో శాంతిభద్రతలు, అసాంఘిక చర్యలు జరగకుండా చూసేందుకు 770కి పైగా సీసీ కెమెరాలను ఈ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. తాజా దోపిడీ నేపథ్యంలో ఈ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పోలీసులు నిత్యం వచ్చి కెమెరాలను పరిశీలించిన దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి శాంతి భద్రతలకు వినియోగించాల్సిన ఈ కెమెరాలను కేవలం వాహనదారులకు ఫైన్లు వేయడానికి మాత్రమే వాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థ యజమాన్యం పర్యవేక్షణ చేస్తున్నది. అత్యంత కీలకమైన కంట్రోల్ సెంటర్‌ను ఇప్పటివరకు జిల్లా యంత్రాగం పూర్తిస్థాయిలో వినియోగించలేదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. స్మార్ట్ సిటీ కింద ఏర్పాటుచేసిన 770 కెమెరాలే కాదు, నగరంలో దాదాపు ప్రైవేట్ పరంగా 4వేలకుపైగా కెమెరాలున్నాయి. ఇంత వ్యవస్థ ఉన్నా దుండగలు రెక్కీలు నిర్వహించి దోపిడీకి పాల్పడుతుంటే.. పోలీస్ యంత్రాంగం ఏమి చేస్తున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.